అంబర్‌పేట, నవంబర్ 20: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య జీవితం ఎందరికో ప్రేరణ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ముందు తరాలకు కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని పేర్కొన్నారు. చుక్కా రామయ్య 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్ విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పూలబొకే ఇచ్చి శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఆనాడు తెలుగు రాష్ర్టాల నుంచి లక్షలాది మంది విద్యార్థులు ఐఐటీలో చదివి అమెరికా, యూరప్, యూకే లాంటి దేశాల్లో స్థిరపడ్డారంటే.. వారికి విద్యాబుద్ధులు చెప్పి ప్రపంచంతో పోటీపడేలా సత్తాను చాటేలా వారికి తర్ఫీదునిచ్చిన మహానుభావుడు చుక్కారామయ్య అని కొనియాడారు. ఒక అధ్యాపకుడిగానే కాదు ఐఐటీల్లో తెలుగు రాష్ర్టాలు, ఇతర రాష్ర్టాలకు కూడా ఒక దిక్చూచిగా నిలిచారని తెలిపారు. శాసనమండలి సభ్యుడిగా కూడా అద్భుతమైన పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆయన నూరో జన్మదినం జరుపుకోవడం అందరికీ ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు.
ఆయన ఇంకా మరింత ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, వందేమాతరం ఫౌండర్ టీ రవీందర్రావు, పల్లె రవికుమార్, జూలూరి గౌరీశంకర్, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, కే రాంచంద్రమూర్తి, మల్లేపల్లి లక్ష్మయ్య, మాడభూషి శ్రీధర్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్, బీఆర్ఎస్ నేతలు బీ వెంకటరెడ్డి, దూసరి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు చుక్కా రామయ్యను కలిసి జన్మదిన శుబాకాంక్షలు తెలిపారు.