బెంగళూరు/న్యూఢిల్లీ, నవంబర్ 20 : కర్ణాటకలో (Karnataka) కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయిన వేళ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. నాయకత్వ మార్పు కోసం అధిష్ఠానంపై డీకే శివకుమార్ (DK Shivakumar) వర్గం ఒత్తిడి పెంచుతున్నది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రెండున్నరేండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ‘ముందుగా కుదిరిన పవర్ షేరింగ్ ఒప్పందం’ ప్రకారం తమ నేతకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని హైకమాండ్‌ను వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు డీకే వర్గంగా ముద్రపడిన 10 మంది ఎమ్మెల్యేలు తాజాగా ఢిల్లీకి వెళ్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది.
హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకు డీకే వర్గ ఎమ్మెల్యేలు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో వారు సమావేశం కానున్నారు. రెండున్నరేండ్ల కిందట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నది వారి ఏకైక డిమాండ్‌గా పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్యేల్లో దినేశ్ గూలిగౌడ, గుబ్బి వాసు ఉన్నారు. అనేకల్ శివన్న, నేలమంగళ శ్రీనివాస్, ఇక్బాల్ హుస్సేన్, కునిగల్ రంగనాథ్, శివగంగ బసవరాజు, బాలకృష్ణ శుక్రవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. వారాంతంలో మరింత మంది డీకే వర్గ ఎమ్మెల్యేలు హస్తినకు చేరుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘నేనెందుకు వెళ్తున్నాను? బంగారం, వజ్రాలు అడిగేందుకు కాదు కదా? డీకే కోసం వెళ్తున్నా’ అని పేర్కొన్నారు. అంతకుముందు డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ మాట్లాడుతూ.. సీఎం సిద్ధరామయ్య తన మాటను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. పవర్ షేరింగ్ గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు.
నాయకత్వ మార్పు వార్తలను సీఎం సిద్ధరామయ్య కొట్టివేశారు. ‘నవంబర్ విప్లవం’ ఏమీ లేదని, అది మీడియా సృష్టేనని పేర్కొన్నారు. పదవి నుంచి దిగిపోనున్నారన్న వార్తలు అవాస్తవమన్నారు. ‘క్రాంతి(రివల్యూషన్) లేదు. భ్రాంతి లేదు. ఐదేండ్ల కోసం మాకు ప్రజలు అధికారం అప్పగించారు’ అని అన్నారు. అయితే పవర్ షేరింగ్‌పై ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు.