గంభీరావుపేట, నవంబర్ 20: తన పెండ్లికి సాయం చేయాలని కోరిన యువతికి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపే ట మండలం గోరంటాలకు చెందిన దానవేణి లక్ష్మణ్-విజయ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. తల్లి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కుటుంబ పోషణ, చేసిన అప్పులు తీర్చేందుకు తండ్రి లక్ష్మణ్ రెండేండ్ల క్రితం ఇద్దరు కూతుళ్లను వదిలి గల్ఫ్ దేశానికి వెళ్లి అక్కడే ఉన్నాడు.
పెద్ద కూతురు శ్రీయ వివాహం ఈ నెల 23న నిశ్చయం కాగా, తండ్రి రాలేని పరిస్థితుల్లో ఉండగా బంధువులే బాధ్యత తీసుకున్నారు. దీంతో శ్రీయ రెండు రోజుల క్రితం వాట్సాప్ ద్వారా కేటీఆర్‌కు పెండ్లి పత్రికతోపాటు ‘అన్న నా వివాహం ఈ నెల 23న ఉంది. అమ్మ లేదు. నాన్న గల్ఫ్‌లో ఉన్నడు. బంధువులే ఇబ్బందులు పడుతూ పెండ్లి చేస్తున్నరు. మీరు కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తారని ఆశిస్తున్నా’ అని సందేశం పంపగా, ఆయన స్పందించారు. రూ.లక్ష ఆర్థిక సాయం పంపించగా, పెళ్లికి మూడు రోజుల ముందుగానే గురువారం స్థానిక నేతలు శ్రీయ ఇంటికి వెళ్లి ‘అన్నయ్య ఆర్థిక కానుకగా’ నగదును అందించారు. అన్న అనగానే స్పందించి ఆర్థిక సాయం చేసిన కేటీఆర్‌కు పెళ్లి కూతురు బంధువులు, కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.