న్యూఢిల్లీ, మార్చి 1: ఉత్తరాఖండ్‌లోని చమోలీలో శుక్రవారం మంచు చరియల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 48 మంది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) కార్మికులలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ఏడుగురిని మంచు చరియల కింద నుంచి వెలికితీయాల్సి ఉంది.
మొత్తంగా ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 50 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో అయిదుగురి ఆచూకీ తెలియడం లేదు. గాయాలతో బయటపడిన వారు మనాలోని ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసు(ఐటీబీపీ) శిబిరం వద్ద చికిత్స పొందుతున్నారు. ఐఈటీబీపీ సమీపంలోని మనా గ్రామం, మనా కనుమ మధ్య దాదాపు ఏడు అడుగుల మేర పేరుకుపోయిన మంచును తొలగించేందుకు 65 మందికి పైగా సహాయక సిబ్బంది రాత్రంతా శ్రమించారు.
మంచు తుపానుతోపాటు దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రతి సంవత్సరం ఈ సమయానికి బీఆర్ఓ శిబిరం మూతపడడం జరుగుతుందని, కాని ఈ ఏడాది హిమపాతం అంతగా లేని కారణంగా బీఆర్ఓ శిబిరాన్ని మూయలేదని మనా గ్రామ పెద్ద పీతాంబర్ సింగ్ తెలిపారు. ఈ కారణంగానే మంచు చరియల కింద కార్మికులు చిక్కుకుపోయారని ఆయన అన్నారు.