భోపాల్: భక్తులను ఆలయానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. (Tractor Overturns) ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు, ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు. పిల్లలతో సహా 20 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొందరు భక్తులు రతన్‌గఢ్ మాతా మందిరానికి ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మైథాన పాలి ప్రాంతం సమీపంలో ఆ ట్రాక్టర్ అదుపుతప్పింది. 15 అడుగుల కల్వర్టులోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టర్‌తోపాటు ట్రాలీ బోల్తాకొట్టాయి. ప్రమాదంలో ఇద్దరు బాలికలు, ఇద్దరు మహిళలు మరణించారు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన పిల్లలతో సహా 20 మందిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.