హర్దోయ్: ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని హర్దోయ్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల మహిళ.. భర్తను, ఆరుగురు పిల్లల్ని వదిలేసి.. ఓ బిచ్చగాడితో వెళ్లినట్లు పోలీసు కేసు నమోదు అయ్యింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 87 ప్రకారం.. భర్త రాజు ఫిర్యాదు చేశాడు. ఆ బిచ్చగాడిపై మహిళ అపహరణ కేసు నమోదు చేశారు. కేసు బుక్ చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
హర్దోయ్‌లోని హర్పల్పుర్ లో జీవిస్తున్న 45 ఏళ్ల రాజుకు.. రాజేశ్వరి అనే భార్య ఉన్నది. ఆ జంటకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. అయితే నానే పండిత్ అనే బిచ్చగాడు అప్పుడు ఆ ఇంటి పరిసరాల్లో అడుక్కునేవాడు. కొన్ని సందర్భాల్లో భార్య రాజేశ్వరితో అతను మాట్లాడేవాడు అని రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫోన్లో కూడా ఆ ఇద్దరు సంభాషించేవారన్నాడు.
జనవరి 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. బట్టలు, కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్నట్లు కూతురు ఖుష్బూకు రాజేశ్వరి చెప్పి వెళ్లిందని ఫిర్యాదులో తెలిపాడు. భార్య తిరిగి రాకపోవడంతో ఆమె కోసం వెతికాడు. ఓ బర్రెను అమ్మితే వచ్చిన డబ్బులతో తన భార్య వెళ్లిపోయినట్లు రాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
నానే పండిట్ అనే బిచ్చగాడు తన భార్యను తీసుకెళ్లి ఉంటాడని రాజు అనుమానం వ్యక్తం చేశాడు. నానే పండిట్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. బీఎన్ఎస్లోని సెక్షన్ 87 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ చట్టం ప్రకారం నిందితుడికి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.