కోల్కతా: పశ్చిమ బెంగాల్(West Bengal)లో సుమారు 34 లక్షల మంది ఆధార్ కార్డు ఉన్నవాళ్లు మృతిచెందినట్లు యూఐడీఏఐ అధికారులు పేర్కొన్నారు. 2009 నుంచి ఆధార్ కార్డు జారీ చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్డు పొందిన తర్వాత మరణించిన వారి సంఖ్య ఆ రాష్ట్రంలో 34 లక్షలుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి యూఏడీఏఐ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో సుమారు 13 లక్షల మందికి ఆధారు కార్డు లేదని ఈసీకి యూఏడీఏఐ చెప్పింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సీఈవో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్వహించిన సమావేశంలో సమాచారాన్ని షేర్ చేసుకున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా చర్య నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఓటరు డేటాను వెరిఫై చేసే అంశంలో ఆధార్ అధికారులతో సహకరించాలని అన్ని రాష్ట్రీ ఎన్నికల సీఈవోలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మీటింగ్ జరుగుతున్నది.
ఓటర్ల జాబితాపై ఈసీకి ఇటీవల అనేక ఫిర్యాదులు అందాయి. ఆ జాబితాల్లో అనేక మంది మరణించిన ఓటర్లు, హాజరకాని ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు, గోస్ట్ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే యూఐడీఏఐ ఇచ్చే డేటా ఆధారంగా.. ఓటర్ల జాబితాల్లో ఉన్న చనిపోయిన ఓటర్ల వివరాలను తొలగించడం సులువు అవుతుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. బ్యాంకు అకౌంట్లతో ఆధార్ లింకు ఉండే కారణం చేత బ్యాంకుల నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మరణించిన వారి, ఫేక్ ఓటర్లను తొలగించే ప్రక్రియలో భాగంగా పశ్చిమ బెంగాల్లో సిర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.