Heart Attack | హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మారిన జీవనశైలి కారణంగా భారత్‌లో ఏటా గుండెపోటుతో 30 వేల మంది మృత్యువాత పడుతున్నారు. గుండెనొప్పిని ముందస్తుగా గుర్తించకపోవడంతోనే మరణాల రేటు ఎక్కువవుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో గుండెపోటు వచ్చే ముప్పును ఇంట్లోనే ఉంటూ సులభంగా కనిపెట్టే టెస్టును స్వీడిష్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రత్యేక అల్గారిథమ్‌తో పనిచేసే ఈ టెస్ట్ సాయంతో 5-8 నిమిషాల్లోనే గుండె జబ్బులు వచ్చే ముప్పును తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఈ వివరాలు ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’లో ప్రచురితమయ్యాయి.
టెస్ట్‌లో భాగంగా వ్యక్తి వయసు, లింగం, బరువు, నడుము చుట్టుకొలత, ధూమపానం అలవాటు, రక్తపోటు, రక్తంలో కొవ్వుల స్థాయి, మధుమేహం, గతంలో కుటుంబసభ్యులకు గుండెజబ్బులు ఉన్నాయా? లేదా? వంటి ప్రశ్నలతో నిండిన ఈ టెస్ట్‌ను తొలుత పూర్తి చేయాల్సి ఉంటుంది. మనం ఇచ్చిన సమాధానాలను ప్రత్యేక అల్గారిథమ్ ట్రెయిన్ చేసి.. గుండెనొప్పి వచ్చే ఛాన్స్‌ను హెచ్చరికలతో సహా సూచిస్తుంది.