ముంబై: గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ను నిర్వాహకుడు నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్టర్ అదుపుతప్పి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ టైర్ల కింద నలిగి ముగ్గురు పిల్లలు మరణించారు. (Children Crushed to Death) మరి కొంత మంది యువతీ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం చిటోడ్ గ్రామంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కోసం ట్రాక్టర్ను సిద్ధం చేశారు.
కాగా, ఉన్నట్టుండి ట్రాక్టర్ డ్రైవర్ కిందకు దిగాడు. ఈ నేపథ్యంలో గణేష్ మండపం నిర్వాహకుడు డ్రైవర్ సీటులో కూర్చొని ట్రాక్టర్ను స్టార్ట్ చేశాడు. అయితే రివర్స్ గేర్ వేయడంతో అదుపుతప్పిన ట్రాక్టర్ అక్కడున్న జనం మీదకు దూసుకెళ్లింది. 13 ఏళ్ల పరి శాంతారామ్ బగుల్, ఆరేళ్ల షేరా బాపు సోనావానే, మూడేళ్ల లాహు పావ్రా ట్రాక్టర్ చక్రాల కింద నలిగి మరణించారు. 25 ఏళ్ల గాయత్రీ పవార్, 27 ఏళ్ల విద్యా జాదవ్, 23 ఏళ్ల అజయ్, 23 ఏళ్ల ఉజ్వల 16 ఏళ్ల లలితా, 17 ఏళ్ల విద్యా సోనావానే తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి, డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.