Jayalalitha | కర్ణాటకలోని బెంగళూరు కోర్టు (Bangalore Court) కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు (Tamil Nadu) దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha)కు సంబంధించిన బంగారు ఆభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆభరణాల అప్పగింతకు మార్చి 6, 7 తేదీలను ఖరారు చేసింది. ఆ రెండు రోజుల్లో ఆభరణాలను (Jayalalithas Jewelry ) తీసుకెళ్లేందుకు ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. మొత్తం 27 కేజీల బంగారు, వజ్రా భరణాలతో పాటు, 700 కేజీలకుపైనే వెండిని ప్రభుత్వానికి అప్పగించనుంది.
బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించినట్లు న్యాయస్థానం తెలిపింది. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలని సూచించింది. కోర్టు నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకునే సమయంలో ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమై భద్రత సిబ్బందితో రావాలని ఆదేశించింది. నగలను తమిళనాడు రాష్ట్రానికి అప్పగించేందుకు ఆ రెండు రోజుల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అదేవిధంగా.. ఈ కేసులో తమిళనాడు ప్రభుత్వం.. కర్ణాటకకు లిటిగేషన్ ఫీజుగా రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈమెకు లెక్కకు మించి ఆస్తులున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయ నివాసం నుంచి అధికారులు పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్రమ కేసులో జయ దోషిగా తేలడంతో 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. జయలలిత చరాస్తులు, స్థిరాస్తులను వేలం వేయడమే ప్రత్యేక కోర్టు ప్రస్తుత విచారణలో ఉంది. ఆభరణాలను వేలం వేసిన తర్వాత కోర్టు ఆమె స్థిరాస్తులను వేలానికి తీసుకురానుంది.
కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వస్తువులు..
అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలతోపాటు పలు వస్తువులన్నీ కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. అందులో 7 కిలోల బంగారు, వజ్రా భరణాలు, 700 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వీటితోపాటు ఖరీదైన చెప్పులు, పట్టుచీరలు, వీడియో క్యాసెట్లు, లాకర్లతోపాటు పలు వస్తువులు కూడా ఉన్నాయి. అదేవిధంగా అమ్మకు సంబంధించిన రూ,1.93 లక్షల నగదు కూడా ఉంది. వీటన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కర్ణాటకలోని బెంగళూరు కోర్టు తాజాగా నిర్ణయించింది.
Also Read..
Lok Sabha elections | లోక్సభ ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి.. మార్చి 9 తర్వాత షెడ్యూల్ విడుదల..!
Rahul Gandhi | పరువునష్టం కేసులో రాహుల్కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన యూపీ కోర్టు
Coaching Student | కోటాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహం లభ్యం