న్యూఢిల్లీ, జూన్ 1: లోక్‌సభ ఎన్నికల యుద్ధం ముగిసింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 2024లో పోలింగ్ శాతాల్లో కొంత తేడా కనిపిస్తున్నది. గత రెండు లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తున్నది. శనివారం ముగిసిన తుది దశతో సహా మొత్తం ఏడు దశల్లో సరాసరిన దాదాపుగా 65 శాతం ఓటింగ్ నమోదైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2019 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శాతం 67.4 కంటే ఇది రెండు శాతం తక్కువ కావడం గమనార్హం. 2014తో పోలిస్తే 2019లో ఒక శాతం పోలింగ్ పెరుగ్గా, ఈసారి కోత పడింది. 2024 లోక్‌సభ ఎన్నికల తొలి ఆరు దశల తుది పోలింగ్ శాతాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించగా.. శనివారం జరిగిన తుది విడతలో రాత్రి 11.45 గంటల సమయానికి 61.63 శాతం నమోదైందని తెలిపింది. గత దశల ట్రెండ్‌ను పరిశీలిస్తే తుది పోలింగ్ శాతంలో 3-4 శాతం మార్పు ఉండే అవకాశం ఉన్నది. ఎలా చూసినా 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే మొత్తంగా 2-3 శాతం తక్కువ పోలింగ్ నమోదు అయినట్టు కనిపిస్తున్నది.