న్యూఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడుల్లో 200 మందికిపైగా పాకిస్థానీలు మరణించారు! వీరిలో అత్యధికులు ఉగ్రవాదులు కాగా, మిగిలినవారు సైనికులు. రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా రాసిన కథనాల ప్రకారం, ఈ నెల 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో 170 మంది ఉగ్రవాదులు మరణించారు. అవమాన భారంతో ఊగిపోతున్న పాక్ ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉండటంతో భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.
గూఢచర్యం ఆరోపణలపై యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన మహమ్మద్ హరూన్ పహల్గాం ఉగ్ర దాడికి ముందు పాకిస్థాన్‌కు వెళ్లినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. హరూన్ ఢిల్లీలో తుక్కు వ్యాపారం చేస్తుంటాడు. అతను పాకిస్థానీ అమ్మాయిని రెండో పెండ్లి చేసుకున్నాడు. ఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయం అధికారి ముజమ్మల్ హుస్సేన్‌తో హరూన్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఓ వ్యక్తిని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఐఏఎఫ్, బీఎస్ఎఫ్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అతడు పాకిస్థాన్ ఏజెంట్లకు చేరవేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిందితుడు సహదేవ సింగ్ గోహిల్ (28)ను ఓ హెల్త్ వర్కర్‌గా గుర్తించారు.
గుజరాత్‌లోని బనాస్కాంఠా జిల్లాలో శుక్రవారం రాత్రి అక్రమంగా భారతీయ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్చివేశారు.