శ్రీనగర్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతంరం జమ్ముకశ్మీర్లో ఉగ్ర మూకల ఆటకట్టించేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరు లష్కరే తొయిబా (Lashkar-e-Taiba) టెర్రరిస్టులను అరెస్టు చేశారు. షోపియాన్ జిల్లాలోని బస్క్చాన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇద్దరు ముష్కరులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలామ్గా గుర్తించామని, ఇరువురు ఎల్ఈటీ (LeT)కి చెందినవారని అధికారులు వెల్లడించారు. వారినుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 102 రౌడ్స్, 2 హ్యాండ్ గ్రనేడ్లు, రూ.5400 నగదు, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
పహల్గామ్లో ఏప్రిల్ 22 నాటి దాడి తర్వాత జమ్ముకశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్ను ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 26 మంది ఉగ్రవాదులను అంతమొందించారు. ఈ నెలాభంలో షోపియాన్, పుల్వామాలోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లలో ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న జరిగిన ఎన్కౌంటర్లో ఎల్ఈటీ (LeT) కమాండర్ షాహిద్ కుట్టయ్ హతమయ్యాడు.