Firing | బీహార్ (Bihar) రాష్ట్రం భోజ్‌పూర్ (Bhojpur) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో (wedding) పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో అక్కడ కాల్పులు చోటు (Firing) చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గర్హాని పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని లహర్పా గ్రామంలో ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహ వేడుకలో భాగంగా వాహనాల పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదికాస్తా హింసాత్మక ఘటనకు దారితీసింది. ఓ వర్గం కాల్పులు జరపడంతో బుల్లెట్ తగిలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఒకరు ఘటనాస్థలిలోనే మరణించగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. మృతులు లవ్కుష్, రాహుల్‌గా గుర్తించారు. ఈ కాల్పుల ఘటనలో మరో ఐదుగురు గాయపడినట్లు వెల్లడించారు. క్షతగాత్రులు ప్రస్తుతం భోజ్‌పూర్ జిల్లా ప్రధాన కార్యాలయం అరాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read..
Spadex Docking | స్పెడెక్స్ సెకండ్ డాకింగ్ సక్సెస్.. రెండు వారాల్లో మరిన్ని ప్రయోగాలకు సిద్ధం
Civil Services Day: మా పాలసీలతో 1000 ఏళ్ల భవిష్యత్తు: ప్రధాని మోదీ