Mamata Banerjee : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ‘సర్’ వల్ల 150 మంది తమ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు ఫిర్యాదు చేశారు. సర్ విషయంలో ఫిర్యాదు చేసేందుకు మమతా బెనర్జీ మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. సోమవారం సీఈసీని కలవగా.. బుధవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను కలిశారు.
ఈ అంశంపై వివరించేందుకు సమయం కావాలని మమత.. సీజేఐని కోరారు. ఆయన మమతకు 15 నిమిషాల సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో సర్ వల్ల కలుగుతున్న ఇబ్బందుల్ని వివరించారు. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్లను కూడా త్వరగా విచారించాలని కోరారు. అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. సీఈసీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సర్ ఒత్తిడి తట్టుకోలేక పశ్చిమ బెంగాల్లో 150 మంది మరణించినట్లు చెప్పారు. వీరిలో ఒక ఎన్నికల అధికారి కూడా ఉన్నట్లు తెలిపారు. మమత మాట్లాడుతూ ‘‘పశ్చిమ బెంగాల్లో మాత్రమే సర్ ఎందుకు..? అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు కనిపించడం లేదా..? ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై మాత్రమే బుల్డోజర్ ప్రయోగిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అనుమతించిన పత్రాల్ని బెంగాల్లో అంగీకరించడం లేదు.
ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకుని, మా రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాలి. ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడాలి. నాలుగు గోడల మధ్య న్యాయం ఏడుస్తోంది. మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదు. ఎన్నికల సంఘానికి ఇప్పటికి ఆరుసార్లు లేఖలు రాసాం. కానీ, ఒక్కసారి కూడా సరైన సమాధానం రాలేదు’’ అని అన్నారు. ఈ అంశంపై ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘సర్’ను నోబెల్ అవార్డ్ గ్రహీత అమర్త్య సేన్, బెంగాల్ కవి జోయ్ గోస్వామి వంటి ప్రముఖులు కూడా వ్యతిరేకించారు.