కొత్తగూడెం ప్రగతి మైదాన్, జనవరి 22 : జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దక్షిణ సింగ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య గురువారం జరిగిన భీకర పోరులో ఓ సీనియర్ నేత సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఐజీ (ఆపరేషన్స్) మైఖేల్ రాజ్ ఎస్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
సరందా అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యల్లో ఉండగా, వారికి మావోయిస్టులు ఎదురు కావడంతో పరస్పరం ఎదురుకాల్పులకు దిగారు. బలగాల ధాటికి తట్టుకోలేక జవాన్లు కాల్పులు జరుపుతూ పారిపోయారు. తర్వాత ఘటనా స్థలంలో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో మావోయిస్టు పార్టీ సీనియర్ నేత పతిరావ్ మాంఝీ అలియాస్ అనల్ దా ఉన్నారని, అతడిపై రూ. కోటి రివార్డు ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.