Road Accidents | దేశంలో (India) రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా లక్షల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, మద్యం మత్తులో వాహనం నడపడం, పొగ మంచు వంటి కారణాలతో దేశ వ్యాప్తంగా ఏటా 4 లక్షలకు పైనే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో కనీసం లక్ష మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గతేడాది రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగినట్లు (12 percent Rise) తాజా నివేదికలో వెల్లడైంది.
‘భారత్‌లో రోడ్డు ప్రమాదాలు – 2022’కు సంబంధించిన నివేదికను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం.. గతేడాది 4.61 (4,61,312 ) లక్షల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందులో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4,43,366 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు 11.9 శాతం పెరిగాయి. ఇక మరణాలు 9.4 శాతం, గాయపడి వారి సంఖ్య 15.3 శాతం పెరిగింది. 2021 ఏడాదిలో 4,12,432 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా.. 1,53,972 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,84,448 మంది గాయపడ్డారు.
ఇక 2022లో 3.3 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగానే చోటు చేసుకున్నట్లు నివేదికలో వెల్లడైంది. మొత్తం ప్రమాదాల్లో 71.2 శాతం మరణాలు అతివేగం వల్లే చోటు చేసుకున్నాయి. రాంగ్ సైడ్‌లో ప్రయాణం వల్ల 5.4 శాతం మంది మరణించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల దాదాపు 10,000 ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
2022లో హెల్మెట్ లేకుండా ప్రయాణించిన కారణంగా 50,000 మంది మరణించారు. ‘2022లో హెల్మెట్ ధరించకుండా ప్రమాదం బారిన పడి మొత్తం 50,029 మంది వ్యక్తులు మరణించారు. అందులో 35,692 (71.3%) మంది వ్యక్తులు డ్రైవర్లు కాగా, 14,337 (28.7%) మంది వెనుక కూర్చున్న ప్రయాణికులు’ అని నివేదిక పేర్కొంది. ఇక కారు, జీపు వంటి వాహనాల్లో సీటు బెల్టు పెట్టుకోని కారణంగా 16,715 మంది మరణించారు. ఇందులో 8,384 మంది డ్రైవర్లు కాగా, 8,331 మంది ప్రయాణికులు ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.
ఇక మొత్తం రోడ్డు ప్రమాదాల్లో జాతీయ రహదారుల్లో 32.9 శాతం కాగా, రాష్ట్ర రహదారుల్లో 23.1శాతం, మరో 43.9 శాతం ప్రమాదాలు ఇతర రహదారులపై జరిగాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా తమిళనాడులో చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువగా జరిగాయి. అయితే, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మాత్రం ఉత్తరప్రదేశ్‌లో అధికంగా ఉంది. మొత్తంగా దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. అందులో గంటలకు 19 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలో వెల్లడైంది.
Also Read..
Jio World Plaza | జియో వరల్డ్ ప్లాజా ప్రారంభం.. అంబానీ పార్టీలో సందడి చేసిన తారలు
Sachin Pilot | భార్యతో విడిపోయిన సచిన్ పైలట్.. ఎన్నికల అఫడవిట్లో వెల్లడి