Earthquakes | గుజరాత్ (Gujarat) రాజ్కోట్ (Rajkot)ను వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే పదికిపైగా సార్లు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే నమోదైంది. వరుస ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్ర ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకూ దాదాపు 12 సార్లు భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 2.6 నుంచి 3.8 మధ్య నమోదైంది. రాజ్కోట్ జిల్లాలోని మూడు తాలూకాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు గాంధీనగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ తెలిపింది. ఉప్లేటా, ధోరాజీ, జెట్పూర్ తాలూకాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఉప్లేటాకు తూర్పు ఈశాన్య దిశలో 27 నుంచి 30 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.
అయితే రాజ్కోట్ కలెక్టర్ ఓం ప్రకాష్ మాత్రం జిల్లాలోని ఉప్లేటా, ధోరాజీ, జెట్పూర్ తాలూకాల్లో 21 సార్లు భూమి కంపించినట్లు చెప్పారు. వీటి తీవ్రత 1.4 నుంచి 3.8 మధ్య ఉన్నట్లు వివరించారు. మొదటి భూకంపం గురువారం రాత్రి 8:43 గంటల సమయంలో ఉప్లేటా పట్టణానికి సమీపంలో నమోదైనట్లు ఓ అధికారి తెలిపారు. అయితే, ప్రకంపనలు స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు వరుస భూకంపాలతో రాజ్కోట్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకూ భూమి పలుమార్లు కంపించినట్లు స్థానికులు తెలిపారు.
Also Read..
Bengal Governor Gets Threat Email | ఈడీ రైడ్స్ హై డ్రామా తర్వాత.. బెంగాల్ గవర్నర్కు బెదిరింపులు
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ కుటుంబంపై నేరాభియోగాలు నమోదు