Sabarimala temple | కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం ( Sabarimala Temple) వద్ద అపశృతి చోటుచేసుకుంది. దర్శనం కోసం క్యూలైన్లో వేచివున్న తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి చెందిన ఓ 11 ఏళ్ల బాలిక ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. సుదీర్ఘ సమయం క్యూలైన్లో వేచి ఉన్న బాలిక ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే అప్రమత్తమైన ఆలయ అధికారులు.. బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. బాలిక గత మూడేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది.
మరోవైపు శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. దీంతో కొండ మొత్తం అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోతోంది. క్యూలైన్లో ఎక్కువ సమయం నిరీక్షించలేక చాలా మంది యాత్రికులు క్యూ వ్యవస్థను అతిక్రమించి బారికేడ్లను దూకేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా పవిత్ర మెట్ల దగ్గర రద్దీ అధికంగా పెరుగుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు కూడా భక్తులను నిలువరించలేకపోతున్నారు. ఈ పరిస్థితులు అక్కడ గందరగోళానికి కారణమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. విపరీతమైన రద్దీ పెరుగుదలపై కేరళ మంత్రి రాధాకృష్ణన్, ట్రావెన్కోర్ బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని 10,000 తగ్గించారు. అంతేకాకుండా రోజువారీ గరిష్ఠ భక్తుల సంఖ్య పరిమితిని 90 వేల నుంచి 80 వేలకు కుదించారు. అదేవిధంగా భద్రతా చర్యలను పటిష్ఠం చేయడంలో భాగంగా సన్నిధానం వద్ద ప్రత్యేక రెస్క్యూ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (Veena George) ప్రకటించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే వైద్య సేవలు అందజేయనున్నట్టు వెల్లడించారు.
కాగా, రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం గత నెల 17వ తేదీ నుంచి తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు 17వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో మండల పూజల కోసం శబరిమల ఆలయాన్ని అధికారులు తెరిచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీంతో అయ్యప్ప దర్శనం కోసం కేరళ నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు శబరిమల కొండకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంటోంది.
Also Read..
Kartika Masam | కార్తికమాసం చివరి సోమవారం.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
SAINDHAV | సైంధవ్ ప్రమోషన్స్ టైం.. బస్లో వెంకటేశ్, శైలేష్ కొలను
Cold Weather | వాతావరణంలో మార్పులు.. చిన్నారులపై చలి పులి