న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చారు. 45 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 18,956 పోస్టులు మంజూరు కాగా, 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఐఐటీల్లో మంజూరైన పోస్టులు 11,170 కాగా.. 4,502 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఐఐఎంలలో 1,566 పోస్టులకు గానూ 493 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు. కేంద్ర వర్సిటీలు, ఐఐఎంలలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 961 పోస్టులు ఎస్సీ రిజర్వ్డ్ కాగా, 578 పోస్టులు ఎస్టీ, 1657 పోస్టులు ఓబీసీ క్యాటగిరీ కింద ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాటగిరీలో వరుసగా 643, 301 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో(ఎన్సీఎల్టీ)లో దాదాపుగా సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎన్సీఎల్టీకి వేర్వేరు ప్రాంతాల్లో బెంచ్‌లు ఉన్నాయి. వీటన్నింటికి గానూ మొత్తం 1 ప్రెసిడెంట్‌తో పాటు 31 మంది జ్యుడీషియల్, 31 మంది టెక్నికల్ సభ్యులు ఉండాలి. అయితే, ప్రస్తుతం ఒక ప్రెసిడెంట్‌తో పాటు 18 మంది జ్యుడీషియల్, 19 మంది టెక్నికల్ సభ్యులే పని చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు.