ethanol : ప్రస్తుతం ప్రపంచ దేశాల్ని చమురు సంక్షోభం వేధిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం కారణంగా అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇండియా కూడా ఇదే పరిస్థితిలో ఉంది. అందుకే, భవిష్యత్తులో కూడా చమురు కొరతను ఎదుర్కొనేందుకు భారతీయ వాహనదారులు ఎక్కువగా వాడే పెట్రోల్‌లో ఇథనాల్ కలపాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన ఇథనాల్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. కానీ, ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. ఎందుకంటే భారీ స్థాయిలో ఇథనాల్ ఉత్పత్తి చేయాలంటే అంతకంటే భారీగా నీళ్లు అవసరం.
నిపుణుల అంచనా ప్రకారం.. ఒక లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి పది వేల లీటర్ల నీళ్లు అవసరం. ఎందుకంటే ఇథనాల్ ఉత్పత్తి చేయాలంటే చెరుకు, జొన్న, వరి అవసరం. ఈ పంటలకు భారీగా నీళ్లు అవసరం. ఇండియాలో ఇథనాల్ ఉత్పత్తి సామర్ధ్యం 1,822 కోట్ల లీటర్లు. ఈ స్థాయిలో ఇథనాల్ ఉత్పత్తి కావాలంటే జొన్న, వరి, చెరుకు పంటలు కూడా అధిక స్థాయిలో ఉత్పత్తి కావాలి. ఈ పంటలకు ఇతర పంటలతో పోలిస్తే ఎక్కువ సాగునీరు అవసరం. అంటే, కేంద్రం గనుక ఇథనాల్‌ను అధికంగా ఉత్పత్తి చేయాలని భావిస్తే దీనికి అనుగుణమైన పంటల సాగును ప్రోత్సహించాలి. దీనివల్ల దేశంలో సాగునీటి కొరత ఇంకా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వరి పంట సాగు చేసి, దాని ద్వారా ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తి అయ్యే వరకు మొత్తం 10,790 లీటర్ల నీళ్లు అవసరమవుతాయని అంచనా. ఇదే జొన్న నుంచి అయితే, 4670 లీటర్ల నీళ్లు, చెరుకు నుంచి అయితే, 3630 లీటర్ల నీళ్లు అవసరం. ఒక కిలో బియ్యం ఉత్పత్తి కావడానికి 3000 లీటర్ల నీళ్లు అవసరం. ఒక టన్ను వరి నుంచి 470 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఇథనాల్ తయారీ పరిశ్రమ నుంచి కూడా అనేక నీటి వ్యర్థాలు విడుదలవుతాయి. ఇవి పర్యావరణానికి మరింత హాని చేస్తాయి. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
కొన్నిచోట్ల మంచి నీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటిది ఇథనాల్ ఉత్పత్తి కోసం ఆయా పంటల్ని ప్రోత్సహిస్తే నీటి సంక్షోభం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. 2024–25లో కేంద్రం ఇథనాల్ కోసం 52 లక్షల టన్నుల వరిని, 2025–26లో 90 లక్షల వరిని కేటాయించింది.