 
                                                            NDA Manifesto | వారం రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ఎన్నికల మేనిఫెస్టోను (NDA Manifesto) విడుదల చేసింది. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు (Government Jobs) కల్పిస్తామని హామీ ఇచ్చింది.
శుక్రవారం ఉదయం పాట్నాలో జరిగిన సమావేశంలో ‘సంకల్ప పత్ర’ పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో కోటి ఉద్యోగాల హామీతో పాటు కోటి మంది మహిళలను లక్షాధికారులను (Lakhpati Didis) చేయడమే తమ లక్ష్యమని ప్రకటించింది. మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2లక్షల వరకు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి జిల్లాలో మెగా లెర్నింగ్ సెంటర్లతో బీహార్‌ను ప్రపంచ అభ్యాస కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తెలిపింది.
ఈబీసీలకు రూ.10లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, ప్రతి రైతుకు ఏడాదికి రూ.9వేల పెట్టుబడి సాయం, బీహార్‌లో ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, నాలుగు నగరాల్లో (పాట్నా, దర్భంగా, పూర్ణియా, భాగల్పూర్) అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో రైలు సేవల ఏర్పాటు, 3,600 కి.మీ రైలు మార్గాలను ఆధునీకరించడం వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత ఎన్నికలు జరగనున్నారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు.
Also Read..
Indians | ఈ ఏడాది 2,790 మంది భారతీయుల్ని వెళ్లగొట్టిన అమెరికా : కేంద్రం
Sardar Patel | సర్దార్ వల్లబాయి పటేల్ 150వ జయంతి.. నివాళులర్పించిన ప్రధాని మోదీ
 
                            