 
                                                            Indians | వలసదారులపై (Deportation) అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టవ్యతిరేకంగా అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందినవారిని దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. ప్రత్యేక విమానాల్లో వారిని సొంత దేశాలకు పంపుతున్నారు. ఇప్పటికే వేలాది మందిని వారి స్వదేశాలకు పంపించిన ట్రంప్ సర్కార్.. ఇప్పటికీ ఆ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 2,790 మందికి పైగా భారతీయ పౌరులను అమెరికా బహిష్కరించినట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. వారందరినీ స్వదేశానికి పంపినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) తెలిపారు. ‘ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకూ అమెరికాలో ఉండటానికి కావలసిన అర్హత ప్రమాణాలను పాటించని, అక్రమంగా నివసిస్తున్న 2,790 మందికిపైగా భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారు అక్కడ చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. వారి జాతీయతను, గుర్తింపును మేమే ధ్రువీకరించాం. ఆ తర్వాత వారిని అమెరికా నుంచి వెనక్కి పంపించారు’ అని తెలిపారు.
వారి వివరాలు పరిశీలించి, నిజమైన భారతీయులేనని నిర్ధరించిన తర్వాతే వారిని వెనక్కి పంపించే ప్రక్రియ పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. భారత్-అమెరికా మధ్య ఉన్న చట్టపరమైన, దౌత్య విధానాలను అనుసరించే బహిష్కరణలు జరిగాయని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికాతో పాటు ఈ ఏడాది యునైటెడ్ కింగ్డమ్ (UK) నుంచి బహిష్కరణకు గురైన భారతీయుల సంఖ్య గురించిన వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ‘యూకే నుంచి ఈ ఏడాది సుమారు 100 మంది భారతీయ పౌరులు బహిష్కరించబడ్డారు. వారి జాతీయతను కూడా ధ్రువీకరించిన తర్వాతే యూకే ఈ చర్యలు తీసుకుంది’ అని ఆయన తెలిపారు.
మరోవైపు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటా ప్రకారం.. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడిన భారతీయ పౌరుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నాలుగేండ్లలో కనిష్ట స్థాయికి చేరింది. అక్టోబర్ 2024-సెప్టెంబర్ 2025 మధ్య అనుమతి లేకుండా అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించిన 34,146 మంది భారతీయులను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో 90,415 మందిని యూఎస్ అధికారులు నిర్బంధించారు. ఈ లెక్కన గతంతో పోలిస్తే ఈ సంఖ్య 62 శాతం తగ్గింది.
Also Read..
Sardar Patel | సర్దార్ వల్లబాయి పటేల్ 150వ జయంతి.. నివాళులర్పించిన ప్రధాని మోదీ
Word of The Year | వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా 67.. మీనింగ్ ఏంటో తెలుసా?
 
                            