బోఫాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించినా ఒక్కో పిల్లల పోషకాహారం కోసం కేవలం రూ.8 చొప్పున మాత్రమే కేటాయిస్తోంది. తీవ్ర పోషకాహార లోపంతో బాధ పడుతున్న పిల్లలకు రూ.12 చొప్పున నిధులు ఇస్తున్నది. ఇటీవల శాసనసభకు సమర్పించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.36 లక్షల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. ఇందులో 30 వేల మందిలో ఈ లోపం తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఒక్కో పిల్లాడికి కేటాయిస్తున్న మొత్తంతో కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనలేమని.. లీటర్ పాల ధర రూ.70 ఉన్న తరుణంలో ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ పూర్తిగా సరిపోదని విపక్షాలు విమర్శించాయి.
‘బక్కచిక్కి పోయిన చిన్నారికి రూ.12 ఇస్తున్నారు. ఆవు మేత ధర రూ.40 ఉంది. ప్రభుత్వ సమావేశాల్లో చిరు తిండ్లకు వేల రూపాయలు ఖర్చవుతాయి. రాష్ట్రం ఎవరిని పోషిస్తున్నది’ అని ఎమ్మెల్యే విక్రాంత్ భురియా ప్రశ్నించారు. షియోపూర్‌లో ఏడాది వయసున్న కార్తిక్ పోషకాహార లోపంతో ఎముకల గూడులాగా మారాడు. భికాపూర్లోని ఆరు నెలల కవలలైన గౌరవ్, సౌరవ్ పరిస్థితి కూడా అదే. చిన్నారులకు సరైన పోషకాహారం అందించలేని ఈ అసమర్థతను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి నిర్మల భురియా అంగీకరించారు. అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు.
పోషకాహార లోపానికి తోడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల మధ్యప్రదేశ్‌లో పిల్లల ఆహారం కలుషితమైన ఘటనలు వెలుగు చూశాయి. కరారియా తెహ్సిల్లోని వార్డ్ నెం.4లోని అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పెట్టిన పప్పులో పురుగులు తేలియాడటం చూసి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలారస్ తెహ్సిల్ జగత్‌పుర హాస్టల్‌కు సరఫరా చేసిన కూరగాయల్లో కప్ప ఉన్నట్టు విద్యార్థులు
గమనించారు.