బెంగళూరు, ఆగస్టు 15: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే కేంద్రంతోపాటు పలు రాష్ర్టాలు మన పథకాన్ని అనుసరిస్తుండగా, తాజాగా కర్ణాటక కూడా అదే బాటలో నడుస్తున్నది. చెరువులు, కుంటలు, సరస్సుల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం రూ.3400 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరులో జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం సిద్దరామయ్య ఈ పథకాన్ని ప్రకటించారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. 2015లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం.. కరువు కాటకాల్ని తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషించింది. గత ఏడాది కేంద్రం ‘మిషన్ కాకతీయ’ తరహాలో ‘అమృత్ సరోవర్’ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని 75 చెరువుల పునరుద్ధరణ చేపడతామని ప్రధాని మోదీ ప్రకటించారు.