న్యూఢిల్లీ, జూన్ 2: దేశంలోని పలు రాష్ర్టాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా బిల్లులను ఆమోదించుకుంటున్నాయి. గత సంవత్సరం (2025)లో పహల్గాం దాడి, తదనంతర సైనిక చర్య, భారత్ సహా వివిధ దేశాలపై ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయం, ఓటరు జాబితాల సమగ్ర సమీక్ష (సర్) తదితర అంశాలపై దేశ ప్రజల దృష్టి నిలిచి ఉండగా.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 600కుపైగా బిల్లులను ఆమోదించుకున్నాయి. వీటిలో అనేకం ఒకే రోజు ప్రవేశపెట్టి.. అదే రోజు ఆమోదించుకున్న బిల్లులు ఉన్నాయి. గత ఏడాది 34 రోజులపాటు సమావేశమైన కర్ణాటక అసెంబ్లీ అత్యధికంగా 84 బిల్లులను ఆమోదించింది. వీటిలో ఒకే రోజు ఆమోదించిన బిల్లులు 17 ఒకసారి, 12 మరోసారి ఉన్నాయి. అస్సాం 21 రోజుల సమావేశాల్లో 60 బిల్లులకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో చర్చలకు ఆస్కారం లేకుండా, అతి తక్కువ స్క్రూటినీతో బిల్లులను ఆమోదిస్తున్న తరహాలోనే దేశంలోని ఏడు రాష్ర్టాలు- ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, మిజోరం, పుదుచ్చెరి, పంజాబ్‌లు తమ శాసనసభల్లో ఉదయం బిల్లులను ప్రవేశపెట్టి సాయంత్రానికి ఆమోదించుకున్నాయని పీఆర్ఎస్ నివేదిక వెల్లడించింది.