ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Feb 17, 2021 , 00:29:30

సకల విద్యాస్వరూపిణి సరస్వతీదేవి

సకల విద్యాస్వరూపిణి సరస్వతీదేవి

  • ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం
  • భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

నారాయణపేట, ఫిబ్రవరి 16: సకల విద్యా స్వరూపిణి సరస్వతీదేవి అని సరస్వతి శిశు మందిరం ఉన్నత పాఠశాల సహ కార్యదర్శి తాటి నర్సప్ప అన్నారు. వసంత పంచమిని పురస్కరించుకొని పట్టణంలోని సరస్వతీ శిశుమందిరం ఉన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతిమాత జన్మదినాన్నే శ్రీ పంచమిగా జరుపుకొంటామన్నారు. శ్రీ పంచమి విద్యారంభ దినమని, వాగ్ధేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలన్నారు. అంతకుముందు యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. 124మంది చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు రతంగపాండురెడ్డి, ప్రధానాచార్యులు దత్తుచౌదరి, ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు. 

ఊట్కూర్‌లో..

ఊట్కూర్‌, ఫిబ్రవరి 16 : మండల కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్‌లో మంగళవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్యసమాజ్‌ కార్యదర్శి జ్ఞానేశ్వర్‌రావు ఆర్య ఆధ్వర్యంలో దంపతులతో సరస్వతీ హోమం నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి శుభ ముహూర్తం ప్రాముఖ్యతను వివరించారు. మండలంలోని తిప్రాస్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం గోపాలకృష్ణ ఆధ్వర్యంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటయ్య, సామాజిక సమరసత మండల కన్వీనర్‌ నర్సింగప్ప, బీంరావు, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులే మొదటి గురువులు 

మక్తల్‌రూరల్‌, ఫిబ్రవరి16 : విద్యార్థులకు తల్లిదండ్రులే మొదటి గురువులని వేదపండితులు వెంకటేశ్‌ ఆచార్యులు  అన్నారు. మంగళవారం మక్తల్‌ పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్‌ పాఠశాలలో వసంత పంచమిని పురస్కరించుకుని చిన్నారులకు సామూహిక అక్షరభ్యాసం చేయించారు. అనంతరం సరస్వతి మాతకు పూజలు చేశారు. కార్యక్రమంలో స్థానిక శిశుమందిర్‌ ప్రధానాచార్యులు కుర్మయ్య, ఉపాధ్యాయులు కావలి వెంకటేశ్‌, ప్రతాప్‌రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

ధన్వాడలో..

ధన్వాడ,ఫిబ్రవరి 16: మండల కేంద్రంలో మంగళవారం వసంత పంచమిని ఘనంగా నిర్వహించారు. శ్రీసాయి సరస్వతి విద్యామందిర్‌, 1వ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో నారాయణ, అంగన్‌వాడీ కార్యకర్త నిర్మల పాల్గొన్నారు.

VIDEOS

logo