త్రిపురారం, మే 10 : మోసకారి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ నెరవేర్చలేని హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఆ పార్టీ మోసాలు బయటపడ్డాయన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
చదువుకున్న వ్యక్తి, రైతు బిడ్డ కంచర్ల కృష్ణారెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి కూడా సాగర్ నీటిని పంటలను ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశామని, ప్రస్తుత సాగర్ ఎమ్మెల్యే అంతా తామే చేశామని మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు.
ఎన్నికల్లో గెలిపిస్తే పార్లమెంట్ రైతుల కోసం పోరాడుతానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. వరికి రూ.3,500, పత్తికి రూ.14వేల మద్దతు ధర వచ్చేలా పార్లమెంట్లో కొట్లాడుతానని తెలిపారు. రైతు బంధు ఇవ్వక, రుణమాఫీ చేయక, సాగు నీరు ఇవ్వక కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. దేశంలోనే వరి పండించడంలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు.
బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచందర్‌నాయక్, నాయకులు కడారి అంజయ్యయాదవ్, గుండెబోయిన కోటేశ్యాదవ్, కామెర్ల జానయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు దస్తగిరి, రైతుబంధు సమితి మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్లు నరేందర్‌రెడ్డి, జయరాంనాయక్, బైరెడ్డి కవిత, లలిత, శ్యాంసుందర్‌రెడ్డి, మడుపు వెంకటేశ్వర్లు, కలకొండ వెంకటేశ్వర్లు, కొనకంచి సత్యనారాయణ పాల్గొన్నారు.
సాగునీరు ఇవ్వక, కరెంట్ కోతలతో కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చిందని జడ్పీ చైర్మన్, నాగార్జునసాగర్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి బండ నరేందర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఇంటికీ మంచినీరు అందిందని, మిషన్ భగీరథ నీళ్లు వెళ్లని గ్రామమంటూ లేదని తెలిపారు. పంటలు ఎండిపోతున్నా మంత్రి పదవుల కోసం ఆరాటపడిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదని ఆగ్రహం వ్యక్తం చేశారు.