మిర్యాలగూడ టౌన్, మార్చి 20 : నేటి యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల భారిన పడకుండా వాటిని తరిమి కొట్టాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవినాయక్ అన్నారు. భగత్ సింగ్ స్మారక విద్యార్థి యువజన ఉత్సవాల్లో భాగంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని కోరుతూ 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా వాటిని అధిగమించి చదువులో, సేవా కార్యక్రమాల్లో, క్రీడా రంగాల్లో ముందుండాలన్నారు.
మాదకద్రవ్యాల వల్ల యువత బంగారు భవిష్యత్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాదంపై యువత పోరాటాలు చేయడమే భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురు లకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. ప్రశ్నించే తత్వాన్ని యువత అలవర్చుకోవాలన్నారు. అవినీతి, అత్యాచారాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, మద్యం, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రుగ్మతల మీదా, దేశంలో విద్య కాషాయీకరణపై యువత పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ్రీను, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జగన్, సైదానాయక్, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి పల్లా భిక్షం, ఎస్ఎఫ్ఐ దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న, రమేశ్, శివ, వంశీ, రాజు, అఖిల్, మహేశ్, సురేశ్ పాల్గొన్నారు.