– ఎన్సీసీ 31వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీధర్‌రావు
– ఎంజీయూలో ఎన్సీసీ క్యాడెట్స్ శిక్షణ ప్రారంభం
రామగిరి, మే 19 : యువత దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని, విద్యార్థి దశలోనే దేశ రక్షణకు సంబందించిన అంశాలపై శిక్షణకు చక్కటి వేదిక ఎన్సీసీ అని ఎన్సీసీ 31వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీధర్‌రావు, సుబేదార్ మేజర్ మాధవరావు అన్నారు. ఎన్సీసీ 31వ బెటాలియన్ నల్లగొండ ఆధ్వర్యంలో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ, పీజీ, ఇతర కళాశాలలు, పాఠశాలలోని ఎస్సీసీ విద్యార్థులకు వారం రోజుల పాటు నిర్వహించే ‘యువ ఆపత్ ధర్మ’ అనే శిక్షణను తొలి రోజు మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విపత్తుల నివారణలో సమాజాన్ని అప్రమత్తం చేయడంలో ఎన్సీసీ క్యాడెట్స్ పాత్ర చాల కీలకమైందన్నారు.
అందుకు నైపుణ్యాలతో కూడిన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనతరం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రమాదాలు, గ్యాస్ సిలిండర్ లీక్ తదితర అంశాల్లో తామను తాము రక్షించుకుంటూ ప్రజలను రక్షించే అంశాలపై ప్రాక్టికల్‌గా చూపిస్తూ శిక్షణ అందించారు. తొలి రోజు శిక్షణలో ఎంజీయూ ఎన్సీసీ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రొ.డా.మచ్చేందర్, ఎన్సీసీ అధికారులు కొమ్ము మల్లయ్య, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణకు వచ్చిన 300 మంది ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

‘యువత దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలి’