సూర్యాపేట, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : వానకాలం ధాన్యం విక్రయాలను పూర్తి చేసుకున్న రైతాంగం ఇప్పుడిప్పుడే యాసంగి సీజన్‌కు సిద్ధమవుతున్నది. దుక్కులు దున్నుతూ నాట్లు వేయడం మొదలు పెడుతున్నది. ఈసారి సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 5,02,372 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఆయా పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఏడాది క్రితం వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏటా రెండు సీజన్లకు రైతుబంధు పేరిట ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేది. కాంగ్రెస్ పాలనలో రైతులకు పెట్టుబడి సాయం అందని ద్రాక్షే అయ్యింది. రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.7,500 చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీని ఈ యాసంగిలోనైనా అమలు చేస్తారా, లేదా అన్నది రైతన్నలను వేధిస్తున్నది.
పదకొండేండ్ల క్రితం వరకూ సూర్యాపేట జిల్లా పరిధిలోని సగం భూములు పంటలు పండక బీడుపడి కనిపించేవి. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో కాళేశ్వరం జలాలు ఇక్కడి భూములను సస్యశ్యామలం చేశాయి. ఎక్కడా లేనివిధంగా తొలిసారి రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రెండు పంటలకు ఎకరా ఒక్కంటికి రూ.5వేల చొప్పున అందిస్తూ రావడం కలిసి వచ్చింది. కాగా, తాము అధికారంలోకి వస్తే రెండు పంటలకు ఎకరా రూ.7,500 చొప్పున ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పటికి రెండు సీజన్లు పూర్తయి మూడో సీజన్ షురూ అయినా నయా పైసా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి సాయం ప్రశ్నార్ధకంగా మారగా.. రైతులు అప్పోసొప్పో చేసి యాసంగి సీజన్‌కు సమాయత్తం అవుతున్నారు.
కొద్ది రోజులుగా దుక్కులు దున్నుతూ నాట్లు వేస్తున్నారు. ఈసారి జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పంటలు కలిపి 5,02,372 ఎకరాల్లో సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అత్యధికంగా వరి 4,78,147 ఎకరాల్లో ఉండనున్నట్లు పేర్కొంటున్నారు. ఆ తరువాత ఆయిల్ పామ్ 4,565 ఎకరాలు, వేరుశనగ 866 ఎకరాలు, జొన్న 519, కంది 52, పెసర 450, చెరుకు 273, ఎండు మిర్చి 201, ఇతర పంటలు 1,323 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు చెప్తున్నారు. ఆ మేరకు సబ్సిడీ విత్తనాలతోపాటు యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులను సమకూర్చే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. ఈ సీజన్‌కు సంబంధించి 68,820 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ప్రస్తుతం 19,037 మెట్రిక్ టన్నులు సిద్ధ్దంగా ఉంది. డీఏపీ 5,650 మెట్రిక్ టన్నులకు గానూ 1,082, ఎంఓపీ 1,900 మెట్రిక్ టన్నులకు గానూ 745 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 37,250 మెట్రిక్ టన్నులకు గానూ 12,316 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అదనపు స్టాక్ కోసం ఆయా ఎరువుల కంపెనీలకు ఇండెంట్లు పంపించారు.