యాదగిరిగుట్ట : ఈనెల 11న యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ( Yadagirigutta Trust Board ) ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భవాని శంకర్( EO Bhavani Shanker ) వెల్లడించారు. గురువారం ఈవో కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమల తరహాలో ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఉదయం 11 .37 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. అనంతరం ప్రెసిడెంట్ సూట్లో ట్రస్ట్ బోర్డ్ మొదటి సమావేశం జరుగుతుందని వివరించారు.
ఆలయ ట్రస్ట్ చైర్మన్గా ఎం సత్యనారాయణ రెడ్డి , మరో ముగ్గురు సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి మీడియాకు అనుమతి లేదన్నారు. స్వీకారో త్సవం నిరాడంబరంగానే కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు ఎవరికి ఆహ్వానం అందజేయలేదని ఈవో వెల్లడించారు. ఒకవైపు దేవస్థానం అధికారులు ఆహ్వాన పత్రికను వీఐపీలకు అందజేస్తూనే మరోవైపు ఎవరికి ఆహ్వానం లేదనడంపై విచిత్రంగా ఉందని స్థానికులు ఆరోపించారు.