న్యూఢిల్లీ, జూలై 24 : ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,783 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభంతో పోలిస్తే 48 శాతం క్షీణత కనబరిచింది. యూఏఈకి చెందిన ఎన్ఎంసీ గ్రూపుతో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒకేసారి రూ.5,680 కోట్ల నిధులు చెల్లింపులు జరుపడంతో లాభాల్లో భారీగండి పడిందని బ్యాంక్ సీఈవో, ఎండీ దేబదత్త చంద్ తెలిపారు. సమీక్షకాలంలో బ్యాంక్‌నకు వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.31,091 కోట్ల నుంచి 6.8 శాతం వృద్ధితో రూ.33,211 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.28 శాతం నుంచి 1.99 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.60 శాతం నుంచి 0.50 శాతానికి దిగొచ్చాయి. గత త్రైమాసికంలో కొత్తగా రూ.3,422 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ 643 కోట్ల నిధులను కేటాయించింది. గతేడాది కేటాయించిన రూ.1,967 కోట్ల కంటే ఇది రెండింతలు తక్కువ. బ్యాంక్ గ్లోబల్ బిజినెస్ 15.4 శాతం వృద్ధితో రూ.30,50,457 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టైర్-2 క్యాపిటల్ జారీ చేయనుండటంతో రూ.6 వేల కోట్ల వరకు నిధులు సేకరించాలని బ్యాంక్ సంకల్పించింది.