Mahakali | ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ లేడీ సూపర్ హీరో మూవీ ‘మహాకాళి’పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాకముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రమోషన్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే భారీ డీల్ కుదరడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘మహాకాళి’ ఫస్ట్ గ్లింప్స్‌ను ఆగస్టు 24 ఉదయం 11:34 గంటలకు విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. గ్లింప్స్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొన్న సమయంలోనే సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు వార్తలు రావడం విశేషంగా మారింది.
అయితే ఈ డీల్‌కు సంబంధించిన ఖచ్చితమైన మొత్తాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు. కానీ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు హక్కులను సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గ్లింప్స్ కూడా చూడకముందే ఓటీటీ సంస్థ ఇంతటి ఆసక్తి చూపడం సినిమాపై ఉన్న బజ్కు నిదర్శనంగా చెబుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన సినిమాటిక్ యూనివర్స్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. భారతీయ పురాణాలు, మైథాలజీని సూపర్ హీరో కాన్సెప్ట్స్‌తో మిళితం చేస్తూ ప్రశాంత్ వర్మ సృష్టిస్తున్న ఈ యూనివర్స్‌లోని ప్రతి ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.
ఇదే క్రమంలో PVCU నుంచి వస్తున్న తొలి లేడీ సూపర్ హీరో కథగా ‘మహాకాళి’ ప్రత్యేకతను సంతరించుకుంది. టైటిల్‌కు తగ్గట్టుగానే శక్తివంతమైన కథ, భారీ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర ‘మహాకాళి’ గా భూమి శెట్టి కనిపించనున్నారు. ఈ సినిమాతో పూజా అపర్ణ కొల్లూరు దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో అత్యంత కీలకమైన నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన పోషిస్తున్న ‘శుక్రాచార్య’ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. అక్షయ్ ఖన్నా లుక్, క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నాయనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘మహాకాళి’తో బాలీవుడ్ నటుడు రోహిత్ సరాఫ్ తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయనతో పాటు ఖుష్బూ సుందర్, శ్రియ రెడ్డి, సముద్రఖని, రాజేష్ బేడి, రజత్ కపూర్, నాజర్, మురళీ శర్మ, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.