ముంబై: మహారాష్ట్ర(Maharastra)లో దారుణం జరిగింది. అమరావతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు శిశువులు మృతిచెందారు. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అగ్నిప్రమాదం జరగడంతో..ఈ విషాదం చోటుచేసుకున్నది. జిల్లా మహిళా ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రి మూడవ అంతస్తులో ఉన్న ఎన్ఐసీయూ వెంటిలేటర్లో స్పార్క్ రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 3.15 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. డాక్టర్లు, నర్సర్లు, ఇతర సిబ్బంది.. ఎన్ఐసీయూలో ఉన్న శిశువులను రక్షించారు. కానీ ఆ ప్రమాదంలో ముగ్గురు శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మరో ఆరు మంది శిశువులను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు.