మెదక్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మెదక్ జిల్లా ఎల్లో అలర్ట్‌లో ఉందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు, రక్షణ చర్యలు చేపట్టాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న రహదారులు, నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయి అలుగులు పారే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఇరిగేషన్, విద్యుత్, జిల్లా పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
పాత, శిథిలావస్థలో ఉన్న, నిర్మాణపరంగా బలహీనమైన భవనాలను తక్షణమే తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదకర భవనాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని, అవసరమైతే తాత్కాలిక సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
అన్ని డ్రైనేజీ కాలువలు, ప్రధాన కల్వర్టులు, ఫీడర్ ఛానళ్లలో పేరుకుపోయిన పూడిక, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, తరచూ నీరు నిలిచే హాట్స్పాట్ల వద్ద భారీ సామర్థ్యం కలిగిన డీవాటరింగ్ పంపులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
వర్షాల కారణంగా దోమల సంతానోత్పత్తి పెరగకుండా యాంటీ లార్వల్ చర్యలు, స్పేస్ స్ప్రేయింగ్, ఫాగింగ్ కార్యక్రమాలను చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు.
తాగునీటి కాలుష్యాన్ని నివారించేందుకు నీటి సరఫరాను క్రమం తప్పకుండా పరీక్షించాలని, నిరంతర క్లోరినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన మేరకు నీటి శుద్ధి మాత్రలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
భారీ వర్షాలతో ఏర్పడే గుంతలను వెంటనే పూడ్చేలా చర్యలు తీసుకోవాలని, తెరిచి ఉన్న నిర్మాణ గుంతలు, వరద నీటితో నిండిన రహదారులు, మ్యాన్‌హోళ్ల వద్ద హెచ్చరిక సూచికలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్లపై పడిపోయిన చెట్లు, శిథిలాలను వెంటనే తొలగించేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
విద్యుదాఘాత ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. తెరిచి ఉన్న జంక్షన్ బాక్సులు, వదులుగా ఉన్న విద్యుత్ తీగలు, నీటితో నిండిన ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలను తనిఖీ చేయాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితులు గుర్తించిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వర్షాకాలంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.