లండన్: ఇంగ్లండ్ క్రికెటర్ , ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సే(Brydon Carse) చిక్కుల్లో ఇరుక్కున్నాడు. శనివారం రాత్రి నైట్‌క్లబ్ వద్ద అతను ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. క్లబ్ వద్ద పోలీసులు అతని చేతులకు బేడీలు వేశారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్‌తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కార్సే ఆడనున్నాడు. అయితే దుర్హమ్ జట్టు సభ్యుడు మాథ్యూ పాట్స్ కూడా ఆ క్లబ్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. డర్బీ క్లబ్లో జరిగిన ఘటన పట్ల ఆరా తీస్తున్నామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ కేసులో అప్డేట్ త్వరలో వెల్లడించనున్నట్లు ఈసీబీ తన ప్రకటనలో పేర్కొన్నది.
ఇంగ్లండ్ తరపున కార్సే 14 టెస్టులు ఆడాడు. అయితే తాజాగా డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 338 రన్స్ తేడాతో డర్హమ్ గెలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ లీడింగ్ బౌలర్‌గా కార్సే నిలిచాడు. ఆ సిరీస్‌లో అతను 22 వికెట్లు తీసుకున్నాడు. పాకిస్థాన్‌తో జరగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో కార్సేను తొలి రెండు టెస్టులకు ఎంపిక చేశారు. గురువారం నుంచి పాక్‌తో రెండో టెస్టు ప్రారంభంకానున్నది. తొలుత కార్సేను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని తర్వాత విడిచిపెట్టారు.