మారుతున్న వాతావరణం, అలర్జీల వల్ల వ్యాపించే దగ్గును చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ, వారాల తరబడి ఇదే తీరుగా ఉంటే అది శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది. లక్షణాలు ఒకేలా అనిపించినప్పటికీ, వ్యాధి తీవ్రత వేర్వేరుగా ఉండొచ్చు. సరైన కారణాన్ని గుర్తించకుండా అంచనాలతో సొంత వైద్యం చేసుకోవడం వల్ల ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులు, శ్వాసనాళాల సమస్యల వల్ల మాత్రమే కాకుండా, శరీరంలోని ఇతర భాగాల్లో తలెత్తే అనారోగ్యాల వల్ల కూడా దగ్గు రావచ్చు. ఆ రకాలేమిటో తెలుసుకుందాం..
ఆస్తమా: దగ్గుతో పాటు పిల్లికూతలు, ఛాతీలో బిగుతుగా ఉండటం, ఆయాసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. రాత్రి వేళల్లో, నిర్దిష్ట పరిస్థితుల్లో ఈ సమస్య మరింత ఎకువవుతుంది.
సీవోపీడీ: నిరంతరం తగ్గని దగ్గు, కఫం పడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది సీవోపీడీకి సంకేతం. ముఖ్యంగా పొగతాగే అలవాటు ఉన్నవారిలో, కాలుష్యానికి గురయ్యేవారిలో ఇది ఎకువగా కనిపిస్తుంది.
యాసిడ్ రిఫ్లక్స్: కడుపులోని యాసిడ్ తిరోగమనం చెంది అన్నవాహిక ద్వారా గొంతులోకి చేరినప్పుడు కూడా దగ్గు వస్తుంది. చాలామందికి గుండెల్లో మంట లేకపోయినా ఈ రకమైన దగ్గు రావచ్చు.
పోస్ట్-నాసల్ డ్రిప్: ముకు లేదా సైసస్ భాగాల నుంచి శ్లేష్మం గొంతులోకి కారడం వల్ల కూడా నిరంతరం దగ్గు వస్తుంటుంది.
లక్షణాలు ఒకేలా ఉన్నంత మాత్రాన వ్యాధి ఒకటే కావాలని లేదు. పదేపదే దగ్గు వస్తుంటే దానిని సాధారణ అలెర్జీ లేదా ఇన్ఫెక్షన్గా భావించి, డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాపుల్లో దొరికే మందులు వాడటం సరైన పద్ధతి కాదు. దీనివల్ల అసలైన జబ్బును ప్రారంభంలోనే గుర్తించే అవకాశం కోల్పోతారు. వైద్యులు రోగి దగ్గు తీవ్రత, అది ఎంతకాలంగా ఉందో పరిశీలిస్తారు. అలాగే ధూమపానం, కాలుష్యానికి గురికావడం వంటి అంశాలను, ఇతర అనారోగ్య చరిత్రను సమీక్షించిన తర్వాతే ఎక్స్-రే, సిటి సాన్ లేదా లంగ్స్ పంక్షన్ టెస్టులు అవసరమో లేదో నిర్ధారిస్తారు.
బ్లడ్ షుగర్: ఒబేసిటీ ఉన్నా, కుటుంబసభ్యుల్లో ఎవరికైనా రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉన్నా, వయసు పెరిగేకొద్దీ మధుమేహానికి దగ్గర అవుతున్నట్టే. మధుమేహ కుటుంబ చరిత్ర ఉన్నవారు.. 30 ఏళ్ల నుంచే తరచూ పరీక్షలు చేయించుకోవాలి.
బ్లడ్ ప్రెషర్ (బీపీ): దేహంలో ప్రవహించే రక్తం.. నాళాలపై కలిగించే ఒత్తిడిని ‘రక్త పీడనం’ అంటారు. ఈ పీడన స్థాయి మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బీపీ పెరగడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. 18 ఏళ్లు పైబడిన వాళ్లు తరచూ బీపీ పరీక్షించుకోవాలి.