‘ఆస్కార్ అందుకోవాలన్నది నా చిన్ననాటి కల. దాని కోసం శక్తివంచన లేకుండా కష్టపడుతున్నా. ఆస్కార్ వేదికపై తమిళంలో మాట్లాడాలని ఆశగా ఎదురుచూస్తున్నా’ అని అన్నారు అగ్ర దర్శకుడు అట్లీ. చెన్నైలో జరిగిన ఓ సినీ వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన ‘రాకా’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో అట్లీ మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘రాకా’ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందా?
అనే ప్రశ్నకు అట్లీ సమాధానమిచ్చారు. ఆ దిశగా తాను తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నానని అట్లీ పేర్కొన్నారు. ‘ఆస్కార్ కల అసాధ్యమేమీ కాదు. మనం సాధించగలమనే నమ్మకం ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాకు మరింత గుర్తింపు రావాలని కోరుకోవడం అత్యాశ కాదని అనుకుంటున్నా. ఆస్కార్ సాధించగలమని నా టీమ్ కూడా నమ్మకంతో ఉంది’ అని అట్లీ చెప్పారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తొలిభాగం ప్రేక్షకుల ముందుకురానుంది.