హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఓటర్లు సమర్పించిన ‘సర్’ ఎన్యుమరేషన్ పత్రాల్లో లోపాలకు సంబంధించి వారికి ఏ ప్రాతిపదికన నోటీసులు జారీ చేస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ‘సర్’ ఎన్యుమరేషన్లో అనుసరిస్తున్న ఆటోమేటెడ్ ప్లాట్ఫారం పనితీరుకు సంబంధించిన వివరాలను వెల్లడించకపోవడాన్ని సవాలు చేస్తూ ఎస్క్యూ మసూద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భౌతిక రికార్డులు తగినంత పరిశీలన లేకుండానే కేవలం ఆటోమేటెడ్ ప్లాట్ఫారం ఆధారంగా నోటీసులు జారీ చేస్తున్నారని చెప్పారు.