యాదగిరిగుట్ట, జూన్24: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. శనివారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి స్వామివారిని గజవాహనంపై, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేపు చేసి ఊరేగించారు. ప్రధానాలయ ముఖ మండపంలో సాగిన దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఆలయాన్ని తెరిచిన అర్చక బృందం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. స్వామి, అమ్మవార్లకు తిరువారాధన జరిపి బాలభోగం నివేదన చేపట్టారు. మంగళశాసనంతో ప్రాబోధిక కార్యక్రమానికి ముగింపు పలికి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులకు పుష్పార్చనలు అత్యంత వైభవంగా సాగాయి. రాత్రి దర్శనాల అనంతరం స్వామివారికి నివేదన చేపట్టిన అర్చకులు శయనోత్సవ సేవను నిర్వహించి ఆలయానికి ద్వార బంధనం గావించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో సందడిగా కనిపించింది. సుమారు 22వేల మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ. 29,05,119 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.
ప్రతి శనివారం గుట్టలో గిరి ప్రదక్షిణ.. 
యాదగిరిగుట్ట దేవాలయంలో ఆలయ ఈఓ ఎన్.గీత శనివారం గిరిప్రదక్షిణ ప్రారంభించారు. ఇక నుంచి ప్రతి శనివారం గిరిప్రదక్షిణ నిర్వహించనున్నారు. గతంలో స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల కాలినడకన తిరిగి గిరి ప్రదక్షిణ చేపట్టేవారు. మిగతా రోజుల్లో ఆ అవకాశం భక్తులకు లేకుండాపోయేది. తాజాగా భక్తులకు గిరిప్రదక్షిణ అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రతి వారం ఉదయం 6 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని ఆలయ ఈఓ గీత సూచించారు. అలాగే దేవస్థానంలోని కల్యాణకట్టలో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత కల్పించే వరకూ ఇతర నాయీబ్రాహ్మణులను రాజకీయ నాయకుల సిఫార్సుతో అనుమతిని నిరాకరించి ఆదుకోవాలని కల్యాణకట్ట నాయీబ్రాహ్మణ సహకారం సంఘం సభ్యులు కోరారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
సీఎం కేసీఆర్ కాన్వాయ్ వాహనానికి ప్రత్యేక పూజలు
యాదగిరిగుట్ట, జూన్ 24 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయిలోని నూతన ల్యాండ్ క్రూయిజర్‌కు ప్రత్యేక పూజలు జరిపారు. శనివారం కొండపైన శివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో వాహనానికి శివాలయ ప్రధానార్చకులు, అర్చకులు శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి హైదరాబాద్ నుంచి ఎస్కార్ట్‌తో యాదగిరిగుట్ట ఆలయానికి చేరుకుని పూజలు చేపట్టారు.