యాదగిరిగుట్ట, మార్చి 28 : యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందడమే కాదు.. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అందజేసే ప్రసాదం, స్వామివారి ఆరగింపుకి అందజేసే బోగాలు, భక్తులకు అందజేసే అన్నదానం కూడా ఎంతో సురక్షితం, శుచీ, శుభ్రతతో కూడినవిగా గుర్తింపు సాధించాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో స్వామివారి ప్రధానాలయం పునర్నిర్మాణంతో పాటు స్వామివారి ప్రసాదాల తయారీకి ప్రత్యేకంగా రూ. 13.80 కోట్లతో అధునాతన యంత్రాలను కొనుగోలు చేశారు. స్వామివారి బోగాలను తయారీకి సుశిక్షుతైన అర్చకులు, వంట స్వాములు నియమించడంతో పాటు ప్రత్యేకమైన రామానూజ కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు నిత్యన్నదాన ప్రసాదాల భవనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా కేంద్ర పుడ్ సేఫ్టీ ఆడిటర్, పుడ్ సేఫ్టీ ట్రైనర్, పుడ్ సేఫ్టీ డిసిగ్నేటేడ్ అధికారులు యాదగిరిగుట్ట ప్రసాద తయారీ, అన్నదానం, రామానూజ కూటమిలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
రామానూజ కూటంలో భోగాలు..
స్వామివారికి ఉదయం బాలభోగం, మధ్యాహ్నం రాజబోగం, రాత్రి నివేదన సమయంలో అందజేసే భోగాలతో పాటు స్వామివారికి భక్తులచే జరిపించు 18 రకాల బోగాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు. పులిహోర, దద్దోజనం, చెక్కర పొంగళి, బెల్లం పొంగళి, క్షీరాన్నం, కేసరిబాత్, సిరా, కీర్, జిలేబి, లడ్డూ, వడ, కారా బూంది, దోశ, శొండెలు, బజ్జీలు, చక్క శీతలం, వడపప్పు, కట్టె పొంగళి వంటి బోగాలలో సమపాలలో మిశ్రమాలను కలుపుతూ తయారు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఆరుగురు ఆరోగ్యవంతమైన వంట స్వాములను, అర్చకులను నియమించారు.
యాంత్రాలతో స్వామివారి ప్రసాదం..
ప్రసాదాలు సిద్ధం చేసేందుకు రూ. 13.8 కోట్లతో భారీ అధునాతన యంత్రాలను కొనుగోలు చేశారు. బూంది ప్రైయర్, షుగర్ సీరప్ మిషన్, దాల్ పుల్వరైజర్, గ్రైండింగ్ మిషన్, చక్కెర సైలోస్ మిషన్ తదితర అధునాతన యంత్రాలలో స్వామివారి లడ్డూ ప్రసాదం, పులిహోర, వడలను తయారు చేస్తున్నారు. లడ్డూ తయారీ చక్కెర పాకం మిషన్‌లో స్టిల్కు సంబంధించిన రెండు సిలండర్లు ఉంటాయి. ఇందులో చక్కెర సైలోస్ మిషన్ ఉంటాయి. వాటి నుంచి చక్కెర స్టిల్ సిలండర్లకు వెళ్తుంది. అక్కడే చక్కెర పాకం తయారవుతుంది. బూందికి ఎంత పాకం, ఆ పాకానికి కావాల్సిన చిక్కదనం ఉండేలా చక్కెర పాకం మిషన్‌కు ముందే అమర్చుతారు.
బూందికి కావాల్సిన పాకం ఎంత కావాలో పంపు కొడితే అంతే పాకం బూందిలో పడుతుంది. అనంతరం కావాల్సిన యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిక్ వంటివి మిషన్ ద్వారా వేస్తారు. చక్కెర పాకంతో మిక్సయిన బూందిని మిక్సర్‌లో కలుపుతుంది. దీని ద్వారా బూంది పాడవుకుండా చక్కటి లడ్డూలు తయారు చేసేందుకు వీలవుతుంది. బూందిలడ్డూ మిక్సర్‌లో 500 కేజీల బూంది లడ్డూకు 100 గ్రాముల జీడిపప్పు, కిస్మిస్, యాలకులు కలిపి, సుమారు 2 నిమిషాల పాటూ మిక్స్ చేస్తారు. ఇలా 16 గంటల్లో 50 నుంచి లక్ష లడ్డూల వరకు తయారు చేస్తారు. హైదరాబాద్‌కు చెందిన హరేకృష్ణ మూమెంట్ లడ్డూ తయారీ బాధ్యతలు తీసుకుంది. గోల్డెన్ టెంపుల్ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ మూమెంట్ ఏపీ, తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్, ఉపాధ్యక్షుడు యేఘ్నేశ్వర దాస నేతృత్వంలో ప్రసాదాల తయారీ పనులు చేపట్టారు. వీరు లడ్డూ తయారీలను అందుబాటులోకి తీసుకువచ్చి ఇక్కడి ఉద్యోగులకు శిక్షణను ఇచ్చారు.
సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..
సురక్షిత పరిశుభ్రమైన ప్రసాద నైవేద్యం తయారీపై ప్రసాద విక్రయశాలలో పనిచేసే వంట స్వాములు, సిబ్బందికి జిల్లా పుడ్ సేఫ్టీ బృందం ప్రత్యేకమైన శిక్షణనిచ్చారు. గత మూడు నెలలుగా యాదగిరిగుట్ట ప్రసాద విక్రయశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వంటశాలలో పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రసాదాలు, స్వామివారికి అందజేసే బోగాలలో వినియోగిస్తున్న ముడి సరుకులు, ఏ ప్రసాదంలో ఏ పదార్థాలను ఎంత శాతం వేయాలి, వాటి వాడకం, చాలా కాలం మన్నిక ఉండేందుకు వాడాల్సిన పదార్థాలకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. ప్రసాదాల వాడకంలో వినియోగిస్తున్న నీటికి పరీక్షలు నిర్వహించారు. దీంతో పాటు ప్రసాదాల తయారీలో నిమగ్నమైన సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది ప్రత్యేకంగా మూతి, తలకు మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఇలా మూడు నెలలుగా పరిశీలించారు. చివరిగా ఈ నెల 4వ తేదీన కేంద్ర పుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో బోగ్ బృందం చివరి ఆడిట్‌ను నిర్వహించి ప్రసాదాల తయారీపై సంతృప్తి వ్యక్తం చేసింది.
కేంద్ర పుడ్ సేఫ్టీ బృందం కితాబు..
యాదగిరిగుట్ట దేవస్థానంలో దేశంలోనే ఒక అత్యుత్తమ, అధునాతన హంగులతో అన్నదాన, ప్రసాద నైవేద్యాల తయారీలో శుచీ శుభ్రతతో పాటు పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు కేంద్ర పుడ్ సేఫ్టీ బృందం కితాబునిచ్చింది. ఈ మధ్య కాలంలోనే రెండు ధపాలుగా కేంద్రం పుడ్ సేఫ్టీ ఆడిటర్ వికాశ్ మిశ్ర, పుడ్ సేఫ్టీ ట్రైనర్ చాగంటి ఆంజనేయులు, పుడ్ సేఫ్టీ డిసిగ్నేటేడ్ డాక్టర్ సుమన్ కల్యాణ్, బోగ్ ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ అధికారి జ్యోతిర్మయి తనిఖీలు నిర్వహించారు. దేవస్థానంలో అన్నదానం, రామానూజ కూటం, ప్రసాద తయారీ, వివిధ వంటశాలలు, ఆహార పదార్థాల నాణ్యత తయారీలో ఆచరిస్తున్న పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో ఆరోగ్యకరం, సురక్షితమైన ఆహార పదార్థాలు, ప్రసాదాలు, స్వామివారి నైవేద్యాల తయారీని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఢిల్లీలో బోగ్ సర్టిఫికేట్‌ను ప్రదానం చేసింది.
పులిహోర, వడల తయారీ..
చివరి ఫ్లోర్లో స్టీమర్ యంత్రాలలోనే కుక్కర్లను అమర్చారు. కుక్కర్లలో బియ్యం వేస్తే 40 నిమిషాలలో పులిహోర చేసేందుకు కావాల్సిన విధంగా వండిన అన్నం వస్తుంది. 30 నుంచి 40 నిమిషాలలో 100 కేజీల బియ్యంను తయారు చేసుకునే వీలుంది. పులిహోర మిక్సింగ్‌కు బ్లెండర్ వాడతారు. ఈ బ్లెండర్ డాయిలోనే పులిహోర పులుసు, వడలను తయారు చేయనున్నారు. గంటలో 300 నుంచి 500 కేజీలు తయారు చేసేందుకు వీలుగా యంత్రాలను సమకూర్చారు.