యాదగిరిగుట్ట, మే14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. మాఢవీధులు, క్యూ కాంఫ్లెక్స్, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, సత్యనారాయణ వ్రత మండపాలు భక్తులతో కిటికిటలాడాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలో నిల్చున్నారు. కొండకింద పార్కింగ్ ప్రాంతం వాహనాలతో నిండిపోయింది. స్వామివారి ధర్మ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు.
స్వామివారి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. తెల్లవారు జూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణతంతు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువారాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో క్షేత్రపాలకుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 45 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.50,39,678 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిఇన వికారాబాద్ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, సైబరాబాద్ క్రైం డీసీపీ రతిరాజ్ దంపతులు, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు.