యాదగిరిగుట్ట, ఏప్రిల్ 30 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వీకెండ్ సెలవులతో ఆదివారం స్వయంభూ నారసింహుడి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. తిరుమాడ వీధులు, క్యూ కాంప్లెక్స్, గర్భాలయ ముఖ మండపం భక్తులతో నిండిపోయాయి. ప్రసాద విక్రయశాల సందడి నెలకొన్నది. కొండపైకి వాహనాల రద్దీ సాగింది. స్వామివారి ధర్మదర్శానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు భారీగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్యార్చనలు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి పంచామృతాలు, గంగాజలాలతో నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.
స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహనంపై కల్యాణోత్సవ సేవను జరిపారు. మండపంలో స్వామి, అమ్మవార్లను తూర్పునకు అభిముఖంగా వెంచేపు చేసి నిత్య తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. మధ్యాహ్న ఆరగింపు చేపట్టారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవ, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. సాయంత్రం సహస్రనామార్చనలు, తులసీ నామార్చనలు జరిపారు. రాత్రి స్వామివారి శయనోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను వైభవంగా నిర్వహించారు. స్వామివారిని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.44,12,760 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.