యాదగిరిగుట్ట, మే 4: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఈ నెల 2న ప్రారంభమైన జయంత్యుత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రధానాలయంలో స్వామి వారికి అభిషేకం, మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. తొలుత మహా మండపంలో 1000 కలశాలల్లో శుద్ధ జలం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలను నింపారు. పూజల అనంతరం స్వయంభువులను అభిషేకించారు. సాయంత్రం అర్చకులు నృసింహ జయంతి వేడుక జరిపించి, ఆవిర్భావ నివేదన, తీర్థ ప్రసాద గోష్టితో ఉత్సవాలకు ముగింపు పలికారు.
పాత గుట్టలో అష్టోత్తర శత ఘటాభిషేకం
పాత గుట్ట పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూర్ణాహుతి, అష్టోత్తర శత ఘటాభిషేకం, నృసింహ జయంతి- నృసింహ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనుబంధ ఆలయమైన యోగానంద లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ఉదయం స్వస్తీవాచనం, విశ్వక్సేనారాధన, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. మల్లాపురానికి చెందిన శ్రీరామ భక్త భజన మండలి, యాదగిరిగుట్టకు చెందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహిళా భజన మండలి, శుభోదయ నిలయం భజన మండలి ఆధ్వర్యంలో భజనలు, శ్రీకృష్ణ సంగీత సభతో భక్తి సంగీతం, యామినిరెడ్డి బృందం భరత నాట్యం, సాయి అభినయ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, మిర్యాల నిఖిల, భరద్వాజ నాట్యాలయం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేపట్టారు.
వైభవంగా నిత్యోత్సవాలు
స్వామివారికి నిత్యోత్సవాలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు తెల్లవారుజామునే స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. వెండిమొక్కు జోడు సేవను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం స్వామిని గరుఢ వాహనంపై మాఢ వీధుల్లో ఊరేగించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా న్విహించారు. సుమారు 12వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.19,37,496 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాల సందర్భంగా మూడు రోజులుగా నిలిపివేసిన సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆమె తెలిపారు.
స్వామిని దర్శించుకున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కుముదిని
శ్రీవారిని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని దర్శించుకున్నారు. గురువారం సాయ ంత్రం కొండకు చేరుకున్న ఆమె స్వయంభువుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి, స్వామివారి వేదాశీర్వచనం చేయగా, ఆలయాధికారి రాజన్‌బాబు స్వామివారి ప్రసాదం అందించారు.