యాదగిరిగుట్ట, మార్చి 1 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక, నవాహ్నిక బ్రహ్మోత్సవాలను శనివారం ప్రారంభించారు. ప్రధానాలయంలో నిత్యపూజల అనంతరం స్వామివారి అనుమతితో వైశేక హోమాలు, ప్రత్యేక తిరుమంజనం జరిపారు. ముందుగా ఆలయ అనువంశికధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ భాస్కర్రావు, డీఈఓ దోర్భల భాస్కర్శర్మ, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనారసింహచార్యులు, కాండూరి వేంకటాచార్యులు స్వామివారి గర్భాలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి నుంచి ఉత్సవాలకు అనుమతి పొందారు. పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలతో దివ్య మనోహరంగా అలకంరించిన స్వామివారిని ప్రధానాలయం ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా అధిష్టింపజేశారు.
నవకలాభిషేకం చేసి బ్రహోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని వేద మంత్రాలను పఠిస్తూ పాంచరాత్రగమ శాస్త్రరీతిలో విష్వక్సేనారాధన జరిపారు. స్వస్తీవాచనంలో ప్రధానార్చక బృందం ప్రధానాలయం, గర్భాలయం, మాఢవీధులు, ప్రాకార మండపాలను శుద్ధి చేశారు. రక్షాబంధనం జరిపారు. అనంతరం స్వయంభు నారసింహుడు, ఆండాళ్ అమ్మవారు, ఆళ్వారు, రామానుజాచార్యులు, విష్వక్సేనుడు, ఉత్సవ మూర్తులకు కంకణధారణ చేశారు. నిర్వాహక బృందం, భక్తులకు రక్షా బంధనం ధరింపజేశారు. సాయంత్రం మృత్స్యంగ్రహం, అంకురారోపణ వేడుకలను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు అర్చక బృందం నిర్వహించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవనం నిర్వహించనున్నారు.