భువనగిరి అర్బన్, జూన్ 26 : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భువనగిరి యాదాద్రి జిల్లా ఎస్పీ అక్షాంశు యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా భువనగిరి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి పట్టణంలో 2 కే అవగాహన ర్యాలీని ఎస్పీ అక్షాంశు యాదవ్ ప్రారంభించారు. ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుండి ప్రారంభమై వినాయక చౌరస్తా వరకు కొనసాగింది. విద్యార్థులు, ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మాణంలో యువకులు ముందుండాలన్నారు. విద్యార్థి దశ నుండి సమాజంపై మంచి ఆలోచన పెట్టాలని, సమాజాన్ని బాగు చేయడంతో పాటు తన జీవితాన్ని, తన భవిష్యత్‌ను మంచి మార్గంలో నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ రవీందర్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, సీఐలు చంద్రబాబు, రమేష్, ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐలు అనిల్ కుమార్, నరేష్, పోలీసు అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.