చౌటుప్పల్, డిసెంబర్ 30 : చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గోశిక యశ్వంత్ కుమార్ (33) గుండెపోటుతో అమెరికాలోని డల్లాస్ లో మృతి చెందాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అతడు డల్లాస్ లో గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. సోమవారం గుండెపోటుతో నిద్రలోనే తుది శ్వాస విడిచాడు. అతడి స్నేహితుల ద్వారా మృతుడి తల్లిదండ్రులకు సమాచారం తెలిసింది. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గోశిక వెంకటేశం, గాయత్రీ దంపతులకు నలుగురు కుమారులు. అందులో యశ్వంత్ రెండో సంతానం. చేతికొచ్చిన కొడుకు గుండెపోటుతో అకాల మరణం చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అల్లుముకున్నాయి. కాగా యశ్వంత్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. వచ్చే ఫిబ్రవరి 21న పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. దీంతో కొద్ది రోజుల్లోనే స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమౌతుండగా యశ్వంత్ అకాల మరణం చెందాడు. యశ్వంత్‌ను పెళ్లికొడుకుగా చూడాల్సిన కుటుంబ సభ్యులు ఇప్పుడు విగత జీవిగా చూడాల్సి రావడం అందరి గుండెలను పిండేసింది. అతడి మృతదేహాన్ని గురువారం తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.