యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : జిల్లా నైసర్గిక స్వరూప పరిధిలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పుడున్న మండలాలు కొత్త పరిధిలోకి చేరనున్నాయి. ఇప్పటికే జిల్లాలో హెచ్ఎండీఏ, వైటీడీఏ కొనసాగుతుండగా, కొత్తగా యాదాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వైయూడీఏ) ఏర్పాటుకానుంది. ఈ మేరకు ఉన్నతాధికారులు పలు అంశాలతో కూడిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
జిల్లాలో 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో కొన్ని హెచ్ఎండీఏ, వైటీడీఏ పరిధిలో ఉన్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో అధికారులు ముమ్మర కసరత్తు చేశారు.
హెచ్ఎండీఏలో ఎన్ని మండలాలు ఉన్నాయి? ఇంకా ఎన్ని కలుపాలి? కొత్తగా ఏర్పాటయ్యే యాదాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి ఏయే మండలాలు ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది? వైటీడీఏను అలాగే ఉంచాలా.. లేకపోతే వైయూడీఏలో విలీనం చేయాలా? ఇప్పటికే ఉన్న వైటీడీఏనే కొనసాగించి.. హెచ్ఎండీఏ మండలాలు మినహా అన్నీ అందులోనే కలపాలా? అనే విషయాలపై కూలంకశంగా కసరత్తు చేశారు. ఈ మేరకు మ్యాప్‌లతో కూడిన ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం అంతిమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
హెచ్ఎండీఏలోకి తుర్కపల్లి, నారాయణపురం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధి ఇప్పటికే జిల్లాలోని ఐదు మండలాల్లో విస్తరించి ఉంది. భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలతోపాటు భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. కొత్తగా మరో రెండు మండలాలు అందులో కలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తుర్కపల్లి, సంస్థాన్‌నారాయణపురం మండలాలను హెచ్ఎండీఏలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. హెచ్ఎండీఏలో చేర్చితే అభివృద్ధికి అధిక నిధులు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ప్రతిపాదనలు ఇలా..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా దగ్గరలో ఉంది. కొంత ప్రాంతం మినహా అధిక శాతం అర్బన్ ఏరియా కలిగి ఉంది. హెచ్ఎండీఏ మినహా మిగతా మండలాలతో ఈ అథారిటీ ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీని పరిధిలోకి రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూరు (ఎం), మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు, రామన్నపేట మండలాలతో వైయూడీఏ ఏర్పాటుచేసేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. వలిగొండ మండలంలోని 5 గ్రామాలు ట్రిపుల్ ఆర్‌లో పోతుండడంతో ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంతిమంగా వైయూడీఏలో కలపనున్నట్లు తెలుస్తున్నది. ఇక ఆలేరు, మోత్కూరు మున్సిపాలిటీలు కూడా దీని పరిధిలోనే ఉండనున్నాయి.
వైటీడీఏ పరిస్థితేంటి?
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటీడీఏ) ఇప్పటికే కొనసాగుతున్నది. దీని పరిధిలో యాదగిరిగుట్ట మండలంతోపాటు భువనగిరి మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. వైటీడీఏపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే వైయూడీఏ బదులు.. ఇప్పటికే ఉన్న వైటీడీఏనే సాగిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఒకవేళ వైటీడీఏను కాదని వైయూడీఏ వైపు మొగ్గు చూపితే యాదగిరిగుట్ట మండలంతోపాటు, మున్సిపాలిటీ కూడా యాదాద్రి అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీలో కలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.