యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి పుణ్యక్షేత్ర పునఃప్రారంభ ముహూర్తం చేరువైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రిలో 17వ సారి పర్యటించారు. మధ్యాహ్నం 1.40 గంటలకు సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకొని ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ అభివృద్ధి పనులతో పాటు పరిసరాలన్నింటినీ పరిశీలించారు. సుమారు ఆరున్నర గంటల పాటు సాగిన పర్యటనలో అణువణువూ పరిశీలించి మహా కుంభ సంప్రోక్షణ నాటికి పూర్తి చేయాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 1.50 గంటలకు యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. సీఎం వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా వచ్చారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, యాదాద్రి ఆలయ ఈఓ గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, సీఎంఓ అధికారి భూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సహా పలువురు ప్రముఖులు, నాయకులు సీఎం కేసీఆర్‌కు తులసి మొక్కలను అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ ద్వారా ఘాట్‌రోడ్డు నుంచి ముఖ్యమంత్రి నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు.
ఆలయ మర్యాదలతో స్వాగతం…
యాదాద్రి క్షేత్ర పర్యటనకు విచ్చేసిన సీఎం కేసీఆర్‌కు బాలాలయంలో వేద పండితులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక అర్చన చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ప్రధానాలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పరిశీలించాక అక్కడి నుంచి బస్సు ఎక్కి రోడ్డు మార్గం ద్వారా కొండ కిందికి చేరుకున్నారు. సుదర్శన యాగం నిర్వహణ కోసం కేటాయించిన 75 ఎకరాల సువిశాల స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట నిర్మాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణంలో ఉన్న సత్యనారాయణ స్వామి వ్రత మండపం, బస్టాండ్ నిర్మాణం, దీక్షాపరుల మండపం, అన్నదాన సత్రాలను పరిశీలించారు. భక్తులు పుష్కరిణిలో మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తరువాత.. స్నానం చేసేందుకు వీలుగా స్త్రీ, పురుషులకు వేర్వేరుగా గదుల నిర్మాణ పనుల ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి గిరి ప్రదక్షిణ రోడ్డు, రింగ్‌రోడ్డు, మెట్ల దారి, కనుమ దారులను పరిశీలించారు. అక్కడి నుంచి స్వామి వారి వైకుంఠద్వారం మీదుగా తిరిగి మళ్లీ కొండపైకి చేరుకున్నారు.
సీఎం పర్యటన సాగిందిలా..
4గంటలపాటు సమీక్ష
మార్చిలో జరుగాల్సిన మహా సుదర్శనయాగం, మహా కుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. సాయంత్రం నాలుగు గంటలకు మొదలైన సమావేశం రాత్రి 8 గంటల వరకు సాగింది. మార్చి 1లోగా ఆలయ పునర్నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కొండ కింద 75 ఎకరాల్లో యాగస్థలికి అవసరమైన స్థలాన్ని వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా యాగానికి సంబంధించిన పనులకు ప్రాధాన్యమిచ్చి సకాలంలో పూర్తి చేసేలా చూడాలని ఆదేశిస్తూ నిర్వహణ బాధ్యతలను విభాగాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు అప్పగించారు. ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా డిజైనింగ్ ఉండాలని, తక్షణమే పనులను ప్రారంభించాల్సిందిగా ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయిని ఆదేశించారు. యాగం నిర్వహణకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు జరుపుతామని, యాగానికి వచ్చే రుత్విక్కులు, యాజ్ఞీకులు, వివిధ దేవాలయాలకు చెందిన ప్రధాన అర్చక బృందం పాల్గొంటారని, ఎవరికీ, ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పటిష్ట బందోబస్తు…
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. టెంపుల్ సిటీ నుంచి ఆలయ ఘాట్ రోడ్డు, రింగ్‌రోడ్డు, కొండపైన, పట్టణంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.